Friday, July 15, 2022

C. స్వామి నారాయణ గురు గౌడ్

స్వామి నారాయణ గురు (1855-1928)

మనదేశంలో నూటికి నూరు శాతం అక్షరాస్యతను సాధించిన రాష్ట్రం ఏదైనా వుందంటే అది ఒక్క కేరళ మాత్రమే! స్త్రీ విద్యలో ఆ రాష్ట్రం కమ్యూనిస్టు చైనా కంటే కూడా అగ్రస్థానంలో వుంది. ఇవాళ కేరళ నర్సులు లేని పెద్ద ఆసుపత్రి యావద్దేశంలో ఒక్కటి కూడా వుండదంటే అతిశయోక్తి కాదు. ఈ అద్భుత ప్రగతి వెనక అలనాడు అభ్యుదయ సామాజిక తత్వవేత్త శ్రీ నారాయణ గురు (1855-1928) చేసిన అపూర్వమైన కృషి ఎంతో వుంది.

ఆ రోజుల్లో వెనుకబడిన కులాల వారికి దేవాలయాల్లో ప్రవేశించే అర్హత వుండేదికాదు. దళితులకైతే దేవాలయాల చుట్టుపక్కలి వీధుల్లోకి, రహదార్లపైకి అడుగుపెట్టే అర్హత కూడా లేదు. అంటరానివాళ్ల నీడ సోకితేనే మైల పడతా మన్నట్టు అసహ్యించుకునేవారు బ్రాహ్మణులు. 

నంబూద్రీలు (బ్రాహ్మణులు) దైవాంశ సంభూతులు కాబట్టి వారు మాత్రమే దేవాలయంలోని గర్భగుడిలో తిరుగాడవచ్చు. అదే రాజ్యాన్ని పాలించే క్షత్రియులకు సైతం ఆ అర్హత లేదు. వారు గర్భగుడికి కనీసం రెండడుగుల దూరాన్ని పాటించాలి. నాయర్లు 16 అడుగుల దూరం, ఈళవ కులస్తులు 32 అడుగుల దూరం, పులయ మరియు పరయ కులస్థులు 64 అడుగుల దూరం పాటించాలి. ఇక నాయాదీలు (మాల మాదిగ తదితర దళిత కులస్తులు) దేవాలయం సంగతి అటుంచి, బ్రాహ్మణుల కనుచూపు మేరలో కూడా కనిపించకూడదు. పొరపాటున ఏ నాయాదినైనా బ్రాహ్మణుడు చూస్తే అతను ప్రాయశ్చిత్తం చేసుకోవలసి వుండేది. 
ఇవీ ఆనాడు (సవర్ణ) మనిషికీ ... (అవర్ణ) మనిషికీ మధ్య, (మనువాద) దేవాలయానికీ మనిషికీ మధ్య వున్న దూరం నియమాలు. దేవుడి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం వారి కులాలను బట్టి పై దూరాలతో విడివిడిగా క్యూ రైలింగ్‌లుండేవి. అంటే ఉదాహరణకి నాయర్లు దేవుడి విగ్రహాన్ని 16 అడుగుల దూరం నుంచి దర్శనం చేసుకోగలిగితే పులయ, పరయ కులస్థులు 64 అడుగుల దూరం నుంచి నిక్కినిక్కి చూస్తూ అస్పష్టంగా దర్శనం చేసుకోవలసి వచ్చేది. ఇక మాలమాదిగలకైతే ఆ దేవుడు ఎలావుంటాడో చూసే అవకాశమేలేదు. 
ఇంకా ఇట్లాంటి అమానుషమైన, అర్థ రహితమైన నియమ నిబంధనలు అనేకం వుండేవి. (వాటి గురించి ఈ పుస్తకంలో కొంతవరకు వివరంగానే ప్రస్తావించడం జరిగింది). ఈళవ తదితర వెనుకబడిన తరగతులకు చెందినవాళ్లు అడుగడుగునా అవమానాలు ఎదుర్కొంటూ కూడా దేవుడి విగ్రహాన్ని దర్శించుకునేందుకు నానా యాతనా పడేవారు. అగ్రవర్ణాల వారు ఆర్థికంగా బాగుండటానికి, తాము దారిద్య్రంతో కునారిల్లుతుండటానికి కారణం తమపై దైవానుగ్రహం లేకపోవడమే, తమకు దైవ దర్శనభాగ్యం లభించకపోవడమే కారణమని కుమిలి పోయేవారు!
ఈ నేపథ్యంలో ఈళవ కులంలో జన్మించిన శ్రీ నారాయణ గురు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, ఆర్యనీకరణ వల్ల చోటుచేసుకున్న మూఢనమ్మకాలకు, దుస్సంప్రదాయాలకు, ఆచారాలకు, అగ్రవర్ణ దోపిడీపీడనలకు వ్యతిరేకంగా గొప్ప సామాజిక ఉద్యమాన్ని నిర్మించారు. 
వెనుకబడిన కులాల వారికోసం ప్రత్యేకంగా దేవాలయాలను నిర్మించారు. అందులో వెనుకబడిన తరగతుల వారినే పూజారులుగా నియమించారు. 
ఆయన నిర్మించిన దేవాలయాలు అవర్ణులలో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మాభిమానాన్ని, ఉత్తేజాన్ని కలిగించాయి. ఆ దేవాలయాలను శ్రీ నారాయణగురు విద్యాలయాలుగా కూడా ఉపయోగిస్తూ వెనుకబడిన తరగతుల వారిలో విద్యావ్యాప్తికి విశేషంగా కృషి చేశారు. 
వివాహాలు, బారసాలలు, చావులు వంటి సందర్భాలలో ఆచారాల పేరిట శక్తికి మించి చేసే ఖర్చులను ఆయన పూర్తిగా రూపుమాపారు. చావులకి, పెళ్లిల్లకి బ్రాహ్మణుల మీద ఆధారపడకుండా, వారు తమను దోపిడీ చేసే అవకాశం లేకుండా చేశారు. ఈ అర్థంలేని ఆచారాల వల్ల అనేక కుటుంబాలు తమ తాహతుకు మించి ఖర్చుచేసి అప్పులపాలవుతుండేవి. ఆయన పుణ్యమాని అవర్ణ సమాజంలో అట్లాంటి వన్నీ మటుమాయమైపోయాయి. ప్రతి ఒక్కరూ విద్య ప్రాధాన్యతను గుర్తించడం ప్రారంభించారు. అంతకుపూర్వం అంటరానివాళ్లకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశార్హత వుండేది కాదు. శ్రీ నారాయణ గురు నిర్మించిన దేవాలయాలే విద్యాలయాలుగా సేవలు అందిస్తుండటంతో వారికి విద్య అందుబాటులోకి వచ్చింది. ఆతరువాత అనేక పాఠశాలలు నెలకొల్పడమే కాక ప్రభుత్వ పాఠశాలల్లో సైతం అంటరానివాళ్లని చేర్చుకోవాలని పోరాడి సాధించారు. దాంతో ఒక్కసారిగా వెనుకబడిన తరగతుల వారి స్థితిగతుల్లో గొప్ప మార్పు చోటుచేసుకుంది. 

సంఘ సంస్కరణకోసం విలక్షణమైన తాత్విక మార్గాన్ని అనుసరించిన శ్రీ నారాయణగురు ప్రభోదాలు అవర్ణులందరికీ శిరోధార్యాలయ్యాయి:
''మనుషులందరికీ ఒకే కులం ... ఒకే మతం ... ఒకే దేవుడు.''
''మతం కోసం మనిషి కాదు. మనిషి కోసం మతం.''
''కులం అడగొద్దు ... కులం చెప్పొద్దు ... కులం గురించి అసలు మాట్లాడనే వద్దు.'' 
''విద్య ద్వారా స్వేచ్ఛ ...సంఘటితమవడం ద్వారా శక్తి ...పరిశ్రమించడం ద్వారా ప్రగతి !'' 
''మతం ఏదైనా గానీ మనిషిని ఎదగనివ్వాలి.''

అంటూ శ్రీ నారాయణ గురు చేసిన ప్రభోదాలు కేరళలోని వెనుకబడిన, దళిత సమాజంలో విప్లవాత్మక మైన మార్పులకు నాంది పలికాయి.

No comments:

Post a Comment

The Chamcha Age Video

Poona Pact