Friday, July 15, 2022

B. మహాత్మ జ్యోతిరావు పూలే: సామాజిక ఉద్యమ పితమహులు

మహాత్మ జ్యోతిరావు పూలే,

ఈ నిచ్చెన మెట్ల సామాజిక వ్యవస్థ కు వ్యతిరేకంగా పోరాడిన మన బహుజన పితామహులు (ఫూలే,సాహు, నారాయణ గురు, పెరియార్) ల పోరాటాన్ని అర్థం చేసుకోవడంలో  మనం విఫలం కావడమే నేటి మన సామాజిక దుస్తితికి కారణం.
ఈ క్లాసు లో మహత్మా జ్యోతిరావు  ఫూలే, నారాయణ గురు గార్ల జీవితం వారి పోరాటం గురించి నేర్చుకున్నాం.
మన పితామహుల పోరాటాల గురించి మరికొంత సమాచారం …


మహత్మా జ్యోతిరావు  ఫూలే(1827-1890)  & సావిత్రి భాయి ఫులే (1831-1897) :

1. జోతిబా ఫులేకు 1 సంవత్సరం వయస్సులో ఉన్నప్పుడే తన తల్లి కన్ను మూశారు,ఆయన తండ్రి సంరక్షణలో పెరిగాడు.

 2.  "థామస్ పేన్" ఆలోచనలతో బాగా ప్రభావితమయ్యాడు మరియు పేన్ యొక్క ప్రసిద్ధ పుస్తకం ‘The Rights of Man’ ను చాలా ఆసక్తితో చదివాడు ఫూలే.

3. కేవలం 22 ఏండ్ల వయసులో జోతిబా ఫులే తన భార్యకు చదువు నేర్పించాడు మరియు అంటరానివారికి పాఠశాలలు ప్రారంభించాడు!  
1849లో, అతను 22 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, శూద్రులకు విద్యను అందించడానికి  భార్యతో ఇంటి నుండి వచ్చేసాడు. (మనం నేడు అమలు చేస్తున్న మధ్యాన భోజన పథకం ఫులే స్వాతంత్రానికి పూర్వమే అమలు చేసాడు)

4. 22 సంవత్సరాల వయస్సులో, అతను కేవలం పూణేలో మాత్రమే కాకుండా లండన్లో కూడా బాగా ప్రసిద్ది చెందాడు!  కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, లండన్ వారు అతని విద్య ఉద్యమాన్ని  కొనియాడారు.

 5. బ్రిటిష్ ప్రభుత్వం బ్రాహ్మణులకు దక్షణగా (డబ్బు/ వనరులు)ఇచ్చే పద్ధతిని జోతిబా ఫులే వ్యతిరేకించారు.  1848-49లో, దక్షణా మొత్తం సుమారు రూ. 4000/- ఉండేది.
22 సం౹౹రాల జోతిబా ఫులే ఈ పద్ధతికి వ్యతిరేకంగా నిలబడి అంటరానివారి విద్య కోసం ఆ డబ్బు కేటాయించాలని డిమాండ్ చేశారు.  అప్పటికే బ్రిటీష్ ప్రభుత్వం దక్షణ డబ్బులు తగ్గించిందని, ఇప్పుడు 22 సంవత్సరాల శూద్రుడు వారిని సవాలు చేయడం అప్పటి బ్రాహ్మణులకు మింగుడు పడలేదు.
 అప్పటివరకు ఎవరూ బ్రాహ్మణుల ఆధిపత్యన్నీ సవాలు చేయలేదు.
 
*చివరికి, బ్రిటిష్ ప్రభుత్వం ఆ దక్షిణలో కొంత భాగాన్ని విద్య కోసం కేటాయించింది!  ఇవి అంటరానివారి విద్యకు మొదటి నిధులు అని చెప్పవచ్చు!
{{ఈ నాటి ప్రిమెట్రిక్ స్కాలర్షిప్ ఆలోచన ఫూలే గారిదే}}

 6. 1854 లో, జోతిబా ఫులే ఒక స్కాటిష్ పాఠశాలలో పార్ట్‌టైమ్ టీచర్‌గా చేరాడు.

7. 1889లో, మహాత్మా జోతిబా ఫులేకు  పక్షవాతం వచ్చింది, దాంతో శరీరం కుడి వైపున పనిచేయకుండా ఆగిపోయింది.  కానీ బహుజనుల పట్ల ఆయనకు అంకితభావం చాలా బలంగా ఉంది, అతను సార్వజనిక సత్య ధర్మ పుస్థక (ది బుక్ ఆఫ్ ది ట్రూ ఫెయిత్) రచన ఎడమ చేతితో పూర్తి చేశారు.

8. బొంబాయిలో, 1885 లో, మహాత్మా జోతిబా ఫులే దిగువ కులాలు తమ కర్మకాండలు మరియు మతపరమైన ఇతరేతర కార్యకలాపాలను స్వయంగా నిర్వహించుకోవాలని నొక్కిచెప్పారు, తద్వారా బ్రాహ్మణ పూజారి పాత్రకు స్వస్తి చెప్పాలని.

 9. జోతిబా ఫులే బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా గొంతెత్తి వేదాలను "పనికిమాలిన కల్పితాలు" అని, "ఆస్పష్ట- అసంబద్ధమైన ఇతిహాసాల" ని మరియు "తప్పుడు స్పృహకు ప్రతిరూపం"అని చెప్పాడు.

10.  1856 లో బ్రాహ్మణులు మహాత్మా జ్యోతిరావు ఫులేను హత్యా చేయడానికి ప్రయత్నించారు, ఎందుకంటే ఫులే బహుజనులకు విద్యను అందించడాన్ని బ్రాహ్మణులు సహించలేదు.

11. 11 మే 1888 న, ముంబైలోని “ముంబై దేశస్థ మరాఠాధ్యతి ధర్మ సంస్థ” లో జ్యోతిబా ఫులేకు ప్రజలే  ‘మహాత్మా’ బిరుదు ఇచ్చారు.

 12. 5 ఫిబ్రవరి 1852: మహాత్మా జ్యోతిబా ఫులే తను నడిపే విద్యా సంస్థల కోసం ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం కోరారు.

13.  అంటరానివారికి మరియు బాలికల కోసం మొదటి పాఠశాలలను ఫులే జంట ప్రారంభించారు: భిదేవాడ (పూణే) - 1848 జనవరి 1న మహాత్మా జోతిబా ఫులే మరియు సావిత్రిబాయి ఫులే గార్లు  బాలికల కోసం భారతదేశపు మొదటి పాఠశాల ప్రారంభించారు.

 14. అంటరానివారి నీడను కూడా అశుద్ధంగా భావించే సమయంలో, అంటరానివారి దాహం తీర్చేందుకు నీరు ఇవ్వడానికి ప్రజలు ఇష్టపడనప్పుడు, సావిత్రిబాయి ఫులే మరియు మహాత్మా జోతిబా ఫులే అంటరానివారి కోసం వారి ఇంటిలోని బావిని వాడుకునే సౌకర్యం కల్పించారు.

15. 28 జనవరి 1853: భారతదేశంలో మొట్టమొదటి శిశుహత్య (భృనహత్య) నిషేధ గృహాన్ని ఫులే దంపతులు ప్రారంభించారు.

16. 1863లో, మొట్టమొదటి అనాథాశ్రమాన్ని జోతిబా ఫులే మరియు సావిత్రిబాయి ఫులే ప్రారంభించారు, అందువల్ల సమాజంలో దయనీయులైన గర్భిణీ వితంతువులకు (ప్రధానంగా బ్రహ్మణ స్త్రీలు) రక్షణ కల్పించారు.

 17. జోతిబా ఫూలే పోవాడ:
"చత్రపతి శివాజీరాజే భోస్లే యాంచా" పుస్తకం జూన్ 1, 1869 న మరియు సుప్రసిద్ధ గులాంగిరి పుస్తకం 1 జూన్ 1873 న ప్రచురించారు.

18.  సెప్టెంబర్ 24, 1873 న, జోతిబా ఫులే తన అనుచరులు మరియు ఆరాధకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ‘సత్య శోధక్ సమాజ్’ (The Society of truth seekars) ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మరియు జోతిరావు  దానికి మొదటి అధ్యక్షుడిగా మరియు కోశాధికారిగా పనిచేశారు.

 19. 1852 నవంబర్ 16న, ఫూలే, విద్యా రంగంలో చేసిన కృషికి మేజర్ కాండీ గారు  జోతిబా ఫులేను సత్కరించారు.

20 . 18 జూలై 1880 న: విస్తృతంగా మద్యం అమ్మకాలను  తీవ్రంగా పరిగణించి మహాత్మా జోతిబా ఫులే పూణే మునిసిపాలిటీ యొక్క యాక్టింగ్ కమిటీ అధ్యక్షుడు ప్లంకెట్‌కు ఒక లేఖ రాశారు.  మద్యం దుకాణాలకు ప్రభుత్వం ఎక్కువ లైసెన్సులు ఇవ్వాలనుకున్నప్పుడు, జోతిరావ్ ఈ చర్యను ఖండించారు, ఎందుకంటే మద్యం వ్యసనం ఎన్నో పేద కుటుంబాలను నాశనం చేస్తుందని ఆయన భావించారు.

21. పత్రికా స్వేచ్ఛ కోసం నిలబడటం:-
1880 నవంబర్ 30 న పూనా మునిసిపాలిటీ అధ్యక్షుడు,' భారత గవర్నర్ జనరల్ లార్డ్ లైటన్' సందర్శన సందర్భంగా ₹1000/- ఖర్చు చేయాలన్న  ప్రతిపాదనను ఆమోదించాలని సభ్యులను అభ్యర్థించారు.  ఆయన పూనా పర్యటన సందర్భంగా అధికారులు ఆయనకు చక్కటి సందేశం, ఆహ్వానం ఇవ్వాలనుకున్నారు.  
లైటన్ అందుకు అనుగుణంగా ఒక చట్టాన్ని ఆమోదించారు. దీనికి వ్యతిరేకంగా పత్రికలు గగ్గోలు పెట్టాయి, మరియు సత్య శోదక్ సమాజ్ యొక్క అనుబంధ దీన్‌బంధు పత్రికా స్వేచ్ఛపై దాడికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు ఫూలే.

లైటన్ వంటి అతిథిని గౌరవించడంలో ప్రజాధనాన్ని (పన్ను చెల్లింపుదారుల ధనాన్ని) ఖర్చు చేయాలనే వారి ఆలోచన జోతిరావుకు నచ్చలేదు.  పూనాలోని పేద ప్రజల విద్య కోసం ఈ మొత్తాన్ని  ఖర్చు చేయవచ్చని ఆయన ధైర్యంగా సూచించారు. పూణే మునిసిపాలిటీలో 32 మంది నామినేటెడ్  సభ్యులలో ఫూలే ఒక్కరే అధికారిక తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసిన సభ్యుడు.  

 22. బ్రిటీష్ రాయల్ కుటుంబాన్ని సవాలు చేయడం ఈ సంఘటన పేద రైతుల పట్ల ఫూలే గారికి ఉన్న అనుబంధాన్ని, గ్రామీణ ప్రాంతంలోని రైతుల బాధలపై బ్రిటిష్ రాజకుటుంబ సభ్యుని దృష్టిని ఆకర్షించడంలో ఆయనకున్న ధైర్యాన్ని కూడా వెల్లడించింది.


మార్చి 2, 1888 న, జోతిరావ్ యొక్క స్నేహితుడు హరి రావుజీ చిప్లుంకర్ "డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ కొనాట్" గారి గౌరవార్థం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.  రైతులు ధరించే వేషధారణలో జోతిరావు ఈ కార్యక్రమానికి హాజరై ప్రసంగం చేశారు.
  
వజ్రాలతో నిండిన ఆభరణాలను ధరించి తమ సంపదను ప్రదర్శించే ధనవంతులపై ఆయన వ్యాఖ్యానించారు మరియు అక్కడకు వచ్చిన నాయకులు/ అతిథులు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించరని, క్వీన్ విక్టోరియా వారసున్ని మరియు ప్రముఖులను హెచ్చరించారు.  హర్ మెజెస్టి ది క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ గారి దృష్టికి  భారతీయుల యొక్క  పరిస్థితిని తెలుపడానికి 'డ్యూక్ ఆఫ్ కొనాట్' (బ్రిటీష్ రాణి యొక్క మనుమడు) నిజంగా ఆసక్తి కలిగి ఉంటే, తను పూణే సమీపంలోని  గ్రామాలను మరియు అంటరానివారు నివసించే  ప్రాంతాలను సందర్శించాలని సూచించాడు.  విక్టోరియా రాణి మనవడు అయిన కొనాట్ డ్యూక్‌ను ఫులే తన సందేశాన్ని విక్టోరియా రాణికి తెలియజేయాలని అభ్యర్థించారు మరియు పేద ప్రజలకు విద్యను అందించాలని గట్టిగా విజ్ఞప్తి చేశారు.




విద్య లేకపోతే వివేకం లేదు, వివేకం లేక నీతి లేదు, నీతి లేనిదే పురోగతి లేదు, పురోగతి లేక విత్తంబు లేదు, విత్తంబు లేకనే శూద్రులు అధోగతి పాలయ్యారు, ఇంత అనర్థం ఒక విద్య వల్లనే..’ అన్నఫులే తాత్వికత మీదే నేటి మన బహుజన ఉద్యమం  ఆధారపడివుంది ...






No comments:

Post a Comment

The Chamcha Age Video

Poona Pact